ఆన్లైన్ ద్వారా బంగారం కొనుగోలు చేసే వారికి సెబీ (SEBI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల డిజిటల్ గోల్డ్ పేరుతో అనేక ప్లాట్ఫార్మ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ పరిధిలోకి రావు. ఇవి సెక్యూరిటీస్ లా ప్రకారం నియంత్రిత ఉత్పత్తులు కావు. అని తెలిపింది. అంటే బంగారం రూపంలో ఉన్నప్పటికీ, ఆన్లైన్ గోల్డ్ లావాదేవీలపై సెబీ నిబంధనలు వర్తించవు. డిజిటల్ గోల్డ్ పేరు ఆకర్షణీయంగా ఉన్నా, నియంత్రణ లేని పెట్టుబడులు ప్రమాదకరమవుతాయి. “భద్రతే మొదటి బంగారం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భద్రత లేదు.. No Security Guarantee…
మొబైల్ ఫోన్లో ఒక్క క్లిక్‌తో బంగారం కొనుగోలు చేసే యుగం ఇది! ‘డిజిటల్ గోల్డ్’ యాప్‌లు చిన్న పెట్టుబడిదారులకూ పసిడి ఆశ చూపిస్తున్నాయి. రూ.100తోనే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో యువత, ఉద్యోగులు, గృహిణులు అందరూ ఈ కొత్త పెట్టుబడి మార్గం వైపు మొగ్గుతున్నారు. చాలా ఫిన్‌టెక్ యాప్‌లు, వాలెట్ సేవలు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్లు చిన్న మొత్తాలతో బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఒక్క రూపాయి విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సౌకర్యం వెనుక నియంత్రణ లేకపోవడం పెద్ద రిస్క్‌గా మారింది.
ప్రమాదం ఎక్కడుంది? Where’s the Risk?
– ఆ కంపెనీ మూతబడితే, మీ బంగారం ఎక్కడుందో కనుక్కోవడం కష్టమవుతుంది.
– మీరు కొనుగోలు చేసిన గోల్డ్ వాస్తవంగా నిల్వలో ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు.
– రిజర్వ్ బ్యాంక్ లేదా సెబీ పర్యవేక్షణ లేనందున వినియోగదారుల రక్షణకు చట్టపరమైన ఆధారం లేదు.
సురక్షిత మార్గాలు ఇవే.. These Are the Safe Options…
బంగారం పెట్టుబడికి SGB (Sovereign Gold Bonds) లేదా Gold ETFs వంటి రెగ్యులేటెడ్ ఉత్పత్తులు మాత్రమే ఎంచుకోవాలి.
RBI, సెబీ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆప్షన్లు భద్రంగా ఉంటాయి.
మోసపూరిత ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వాగ్దానాలపై నమ్మకం పెట్టుకోవద్దు.
డిజిటల్ గోల్డ్‌లో రిస్క్ ఏంటి..? What’s the Risk in Digital Gold?
డిజిటల్ గోల్డ్ అమ్మే కంపెనీలు మీ పేరిట బంగారం నిల్వ ఉందని చెబుతాయి. కానీ ఆ బంగారం వాస్తవంగా ఉందా లేదా అనే నిర్ధారణ కష్టమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా Paytm Gold, PhonePe Gold, Google Pay Gold Locker , Tata Neu Gold, HDFC Securities DigiGold, Groww Gold వంటి యాప్‌లు డిజిటల్ గోల్డ్ సేవలు అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం తగిన పారదర్శకత చూపడం లేదు. అటువంటి కంపెనీ మూతపడితే, మీ బంగారం లేదా దాని విలువను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. చట్టపరమైన మార్గాలు స్పష్టంగా లేవు. పైగా, ఈ సేవలు అందించే సంస్థలు చాలా వరకు ఫిన్‌టెక్ స్టార్టప్స్ మాత్రమే. వాటి స్థిరత్వం అనుమానాస్పదం. ఆన్లైన్ ప్రకటనలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు వినియోగదారుల నుంచి డబ్బు దోచుకునే ఘటనలు నమోదవుతున్నాయి. లావాదేవీల భద్రత, డేటా సెక్యూరిటీ అంశాలు కూడా సవాలు అవుతున్నాయి.
మరి బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే..? Then How to Invest Safely in Gold?
ఆభరణాలు, బార్లు, నాణేలు రూపంలో బంగారం కొనడం మనకు తెలిసిన మార్గమే. కానీ వీటిలో భద్రతా సమస్యలు ఉంటాయి. నిల్వ, ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జీలు వంటివి అదనపు ఖర్చులు. పైగా అమ్మే సమయానికి నష్టపోయే అవకాశం ఎక్కువ. బంగారంలో పెట్టుబడి అంటే కేవలం ఆభరణాలు కొనడం కాదు. ప్రభుత్వ, సెబీ పర్యవేక్షణలో ఉన్న మార్గాలే నిజమైన భద్ర పెట్టుబడి.
సార్వభౌమ గోల్డ్ బాండ్లు (SGBs)
సార్వభౌమ గోల్డ్ బాండ్లు (SGBs) ప్రస్తుతం బంగారంపై పెట్టుబడికి అత్యంత భద్రమైన మార్గంగా నిలుస్తున్నాయి. వీటిని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రభుత్వం తరఫున జారీ చేస్తుంది. వీటికి బంగారం ధరల ఆధారంగా విలువ ఉంటుంది. సంవత్సరానికి 2.5% వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి 8 సంవత్సరాలు, కానీ 5 ఏళ్ల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. బంగారం ధర పెరిగితే లాభం, తగ్గినా నష్టమేమీ ఉండదు.
గోల్డ్ ETFలు .. Gold ETFs
సెబీ పర్యవేక్షణలో ఉండే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ETFs) కూడా మంచి ఆప్షన్.
వీటిని స్టాక్ మార్కెట్లో షేర్లా కొనుగోలు చేయవచ్చు.
భౌతిక బంగారం కొనాల్సిన అవసరం ఉండదు.
ట్రాన్స్పరెన్సీ, లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు Gold Mutual Funds
ETFల్లో పెట్టుబడి పెట్టే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఉత్పత్తులు అందిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ఖాతా అవసరం లేకుండా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఎవరికి ఏది సరైనది? Which Option Suits Whom?
భద్రత కోరేవారికి: SGBలు ఉత్తమం.
లిక్విడిటీ (తక్షణ అవసరాలు) ఉన్నవారికి: గోల్డ్ ETFs సౌకర్యవంతం.
చిన్న మొత్తాలతో పెట్టుబడి కోరేవారికి: గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు సరైన ఎంపిక.
పసిడి ధరలు ఇలా.. Gold Prices Like This…
ఇటీవల పసిడి ధరలు రోలర్‌కోస్టర్‌లా ఊగిసలాడుతున్నాయి. ఒకరోజు పెరుగుదల.. మరుసటి రోజు స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్ల మార్పు అంచనాలు, మధ్యప్రాచ్యంలో జియోపాలిటికల్ ఉద్రిక్తతలు ఇవన్నీ కలసి బంగారంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర ₹ 1,24,112 గా ఉంది. విజయవాడ లో ₹ 1,30,726 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ బంగారం సుమారుగా ₹ 1,13,000 (పది గ్రా) గా ఉంది. హైదరాబాద్‌లో ₹ 1,13,700 పాటు (పది గ్రా) గా ఉంది.
గత నెలలో పెరుగుదల Rise in the Past Month
అక్టోబరు చివరి వారం నుంచి పసిడి రేట్లు వేగంగా పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ పది గ్రాముల ధర ₹1,10,000 నుంచి ₹1,14,000కు చేరింది. 24 క్యారెట్ ధరలు ₹1,20,000 దాటాయి. ద్రవ్యోల్బణ భయాలు, డాలర్ మార్పిడి విలువలో అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లారు.
తగ్గుదల ఎందుకు? Why the Decline?
అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంటాయన్న సంకేతాలతో కొంతమంది పెట్టుబడిదారులు లాభాల వసూళ్లకు దిగారు. ఫలితంగా, గత రెండు రోజుల్లో బంగారం ధరలో రూ.500–₹700 వరకు తగ్గుదల నమోదైంది. అయితే ఇది తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారా? Already Invested in Digital Gold?
డిజిటల్ గోల్డ్ యాప్‌ల సౌలభ్యంతో ఇప్పటికే వేలాది మంది బంగారంలో పెట్టుబడులు పెట్టారు. ఒక్క క్లిక్‌తో కొనుగోలు, అమ్మకం చేయగల అవకాశం ఉండడంతో చాలామంది చిన్న మొత్తాల్లోనూ పసిడి సేకరించారు. అయితే ఇప్పుడు సెబీ హెచ్చరికలు, నియంత్రణ లేమి నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినవారైతే ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
మీ యాప్ & ప్రొవైడర్ ఎవరో తెలుసుకోండి .. Know Your App & Provider
మొదట మీరు బంగారం కొనుగోలు చేసిన యాప్ ఎవరి భాగస్వామ్యంతో ఉందో తెలుసుకోండి.కొన్ని సంస్థలు నిజమైన భౌతిక బంగారాన్ని వేర్‌హౌస్‌లలో భద్రపరుస్తాయని చెబుతాయి. కానీ మీరు సర్టిఫికెట్, రసీదు, ట్రాన్సాక్షన్ హిస్టరీలను సురక్షితంగా ఉంచుకోవాలి.
లాంగ్టర్మ్గా ఉంచాలా? లేదా అమ్మాలా? Hold Long-Term or Sell?
నియంత్రణ చట్రం ఇంకా స్పష్టంగా లేకపోవడంతో, దీర్ఘకాలిక పెట్టుబడిగా డిజిటల్ గోల్డ్‌ను కొనసాగించడం రిస్కే. మొత్తం పెట్టుబడిలో 5–10% కంటే ఎక్కువను డిజిటల్ గోల్డ్‌లో పెట్టకూడదు. ఇప్పటికే పెట్టి ఉంటే, ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు విక్రయించి రాబడిని సురక్షిత పథకాల వైపు మళ్లించాలి.
భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు.. Can Be Converted to Physical Gold
అధిక యాప్‌లు “డెలివరీ ఆప్షన్” అందిస్తున్నాయి. నిర్దిష్ట మొత్తానికి చేరుకున్న తర్వాత, ఆన్లైన్లో బంగారం భౌతిక రూపంలో మీ చిరునామాకు పంపించే అవకాశం ఉంది. అయితే మేకింగ్ ఛార్జీలు, డెలివరీ ఫీజులు ఉండొచ్చు. అయినా, భద్రత దృష్ట్యా ఇది ఉత్తమ మార్గమని నిపుణులు అంటున్నారు.
జాగ్రత్త తప్పనిసరి.. Caution Is Essential
డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫార్మ్లు ఆర్థిక సంస్థల మాదిరిగా పర్యవేక్షణలో లేవు. అందుకే అనుమానాస్పద యాప్‌లను దూరంగా ఉండాలి. మీ ట్రాన్సాక్షన్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు . నిరంతరం బంగారం బ్యాలెన్స్ చెక్ చేసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలి.
