చేతిలో డబ్బు లేకపోయినా, “క్రెడిట్‌కార్డు ఉంది కదా!” అంటూ చాలామంది ఆత్మవిశ్వాసంగా ముందడుగు వేస్తున్నారు. శుభముహూర్తం పేరుతో, ఆఫర్లు, వివాహాలు , పండుగలు, ఇతరత్రా శుభ కార్యాల పేరిట క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్రెడిట్‌కార్డు స్వైప్’తోనే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ విధానం నిజంగా లాభదాయకమా? లేక ఆర్థిక భారమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తక్షణ సౌలభ్యం… Instant Convenience…
క్రెడిట్‌కార్డుతో చెల్లింపులు చేయడం వల్ల వెంటనే డబ్బు అవసరం ఉండదు. బిల్లింగ్ డేట్ వచ్చే వరకు సులభంగా సమయం లభిస్తుంది. కొన్ని బ్యాంకులు జ్యువెలరీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తున్నాయి. దీని వల్ల 1–2% వరకు లాభం దక్కవచ్చు.
వడ్డీ రేటు.. Interest Rate
క్రెడిట్‌కార్డుతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి డిస్కౌంట్లు అందించకపోవడం సాధారణం. అంతేకాకుండా EMI ఆప్షన్ ఎంచుకున్నప్పుడు వడ్డీ రేట్లు 18–36% వరకు ఉండొచ్చు. ఒకవేళ బిల్లు సమయానికి చెల్లించకపోతే, భారీ వడ్డీతో పాటు లేట్ ఫీజులు కూడా విధిస్తారు.
లెక్కలు వేస్తే… If You Do the Math…
ఒక గ్రాము బంగారం ధర రూ.12,000 అనుకుందాం. రూ.70,000 విలువైన ఆభరణం క్రెడిట్‌కార్డుతో కొంటే, EMIపై వడ్డీతో కలిపి రూ.75,000–77,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే క్యాష్తో కొంటే జ్యువెలర్స్ 1–2% డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బంగారం వంటి విలువైన వస్తువులను క్రెడిట్‌కార్డుతో కొనడం చివరికి నష్టమే. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ మార్గాన్ని ఎంచుకోవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చేతిలో డబ్బు లేని వారికి క్రెడిట్‌కార్డు ఒక తాత్కాలిక సౌలభ్యం మాత్రమే. కానీ జాగ్రత్తగా వాడకపోతే అది లాభం కంటే నష్టమే అవుతుంది. బంగారం అంటే పెట్టుబడి… దానికి వడ్డీ భారమైపోతే.. నిజమైన వెలుగు తగ్గిపోతుంది!
ఆర్బీఐ ఆంక్షలు.. RBI Restrictions
క్రెడిట్‌కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేయడంపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బంగారం ఒక భౌతిక ఆస్తి (physical asset) కావడంతో, దానిపై క్రెడిట్ లావాదేవీలు ఎక్కువైతే వ్యక్తిగత అప్పు భారాలు పెరుగుతాయని ఆర్బీఐ అభిప్రాయం. అందుకే బ్యాంకులు, కార్డు సంస్థలు బంగారం కొనుగోళ్లకు క్రెడిట్ లిమిట్‌ను పరిమితం చేయాలని సూచించింది.
ఎందుకీ ఆంక్షలంటే.. Why These Restrictions?
గత ఏడాది పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్లలో 30% వరకు క్రెడిట్‌కార్డు లావాదేవీలు నమోదయ్యాయి. దీని వలన అనేక మంది వినియోగదారులు బిల్లు చెల్లింపులు ఆలస్యం చేయడం, అప్పు భారంతో ఇబ్బందులు పడటం మొదలైంది.ఇంకా కొన్ని బ్యాంకులు ఆన్లైన్ జ్యువెలరీ కొనుగోళ్లపై నగదు సమానంగా (cash-equivalent) వర్గీకరణ చేయకపోవడంతో, రిస్క్ మేనేజ్మెంట్ లోపాలు చోటు చేసుకున్నాయని ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఆంక్షలు విధించింది.
వినియోగదారులపై ప్రభావం.. Impact on Consumers
క్రెడిట్‌కార్డుతో బంగారం కొనాలనుకునే వారికి ఇప్పుడు కాస్త కఠినతరమైన నియమాలు అమలులోకి వస్తాయి. EMI సౌకర్యం పొందాలంటే పూర్తి ధ్రువీకరణ అవసరం. బంగారం కొనుగోలుకు ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజులు ఉండొచ్చు. బిల్లు ఆలస్యం చేస్తే భారీ వడ్డీ తప్పదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం “బంగారం పెట్టుబడి వస్తువు. అప్పుతో కొనడం ఆర్థికంగా తప్పుడు నిర్ణయం. ఆర్బీఐ చర్య వినియోగదారులను మంచిదే.”
క్రెడిట్‌కార్డు లోన్ భారమవకుండా ఉండాలంటే! To Avoid the Burden of Credit Card Loans!
– బంగారం ఆభరణాలు కొనుగోలుకు ముందే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. కార్డు లిమిట్లో కొంత భాగం ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలి. ఒక్కసారిగా ఖర్చులు పెరిగినా.. అప్పుడు అప్పు బారిన పడకుండా ఉండొచ్చు.
– EMI ఆకర్షణీయంగా అనిపించినా, దాగి ఉన్న వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు తప్పక చెక్ చేయాలి. బంగారం మీద EMI చెల్లింపులు సాధారణంగా 18–24% వడ్డీతో ఉంటాయి. అంటే రూ.1 లక్ష బంగారానికి చివరికి రూ.1.15–1.20 లక్షలు చెల్లించాల్సి రావచ్చు.
– “క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు” అని ప్రచారం చేసే ఆఫర్లు ఎప్పుడూ లాభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటివల్ల వడ్డీపై ప్రభావం ఉండదు. డిస్కౌంట్ కన్నా వడ్డీ లెక్కలు ఎక్కువైతే లాభం శూన్యం!
– డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అనధికార లింకులు, రుణ యాప్‌ల ద్వారా బంగారం కొనడం ప్రమాదం. ఆర్బీఐ అనుమతితో ఉన్న ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే లావాదేవీ చేయాలి.
– బిల్లు వచ్చే సమయానికి కనీస చెల్లింపుతో సరిపెట్టకుండా, మొత్తం బకాయిని ఒకేసారి చెల్లించడం ఉత్తమం.
– క్రెడిట్‌కార్డుతో బంగారం కొనడం తప్పు కాదు . కానీ సక్రమంగా చెల్లింపులు చేయాలి. EMI లెక్కలు సరిగ్గా అంచనా వేయాలి. అవసరం లేకుండా అప్పు చేయకూడదు.
– ఆఫర్ల పేరుతో అవసరం లేని బంగారం కొనడం మానుకోవాలి. ఆర్థిక భారం మోసే స్థోమత ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ వాడుకోవాలి.
క్రెడిట్ కార్డుపై రూ.లక్ష విలువైన బంగారు ఆభరణాలు కొంటే.. If You Buy Gold Jewellery Worth ₹1 Lakh on a Credit Card…
– రూ.1,00,000 విలువైన ఆభరణం క్రెడిట్‌కార్డుతో కొనుగోలు చేసి 6 నెలల EMI ఎంచుకుంటే:
వడ్డీ రేటు సగటుగా 18% వార్షికంగా (1.5% నెలకు)
నెలవారీ EMI సుమారు రూ.17,500–17,600 వరకు ఉంటుంది.
మొత్త చెల్లింపు రూ.1,05,000–1,06,000 మధ్యలో అవుతుంది. అంటే రూ.5,000–6,000 అదనపు భారమే!
12 నెలల EMI ఎంచుకుంటే … If You Choose a 12-Month EMI…
వడ్డీ రేటు 24% వార్షికంగా (2% నెలకు)
నెలవారీ EMI సుమారు రూ.9,500–9,600
మొత్తం చెల్లింపు రూ.1,14,000–1,15,000 వరకు ఉంటుంది. అంటే రూ.14–15 వేల రూపాయల అదనపు భారం పడుతుంది.
బ్యాంకు చార్జీలు .. Bank Charges
EMI వడ్డీతో పాటు బ్యాంకులు కొన్ని అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తాయి:
ప్రాసెసింగ్ ఫీజు: కొనుగోలు విలువలో 1–2% వరకు (రూ.1,000–2,000)
GST చార్జీలు: వడ్డీ, ఫీజులపై 18% జీఎస్టీ
ప్రీక్లోజర్ ఫీజు: మధ్యలో EMI క్లియర్ చేస్తే అదనంగా 2–3% పన్ను
ఇవన్నీ కలిపి చూస్తే, రూ.1 లక్ష బంగారం కోసం సుమారు రూ.1.16–1.18 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.
ఆలోచించి కొనుగోలు చేయాలి .. Think Before You Buy
గతంలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ వంటి సంస్థలు క్రెడిట్ కార్డుల ద్వారా బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించేవి. రూ.5,000-10,000 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు EMIలుగా మార్చుకునే అవకాశం ఇచ్చేవి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు, తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారులకు సౌలభ్యం కల్పించేవి. కొంతమంది వ్యాపార సంస్థలు బ్యాంకులతో కలిసి ప్రత్యేక ఆఫర్లను కూడా ఇచ్చేవి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ధోరణిపై బ్రేక్ వేసింది. బంగారం దిగుమతులు, రిటైల్ వినియోగం అదుపులో ఉండేలా చర్యలు తీసుకుంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన బంగారు కొనుగోళ్లను ఇకపై సమాన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చవద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, బ్యాంకు శాఖల్లో క్రెడిట్ కార్డు ద్వారా బంగారు నాణేలు కొనుగోలు చేయడానికీ బ్రేక్ వేసింది . ఈ నిర్ణయం వల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి తాత్కాలిక ఇబ్బందులు కలిగినా, దీర్ఘకాలంలో అప్పు భారం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “బంగారం విలువ పెరగొచ్చు కానీ క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు ఇంకా వేగంగా పెరుగుతాయి. వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు కలిపి మొత్తం వ్యయం ఎక్కువవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కొనుగోలు చేయాలి,” అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
