కరోనాతో కుదేలైన రంగాల్లో విమానయానం మొదటిది. పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఆ రంగం దాదాపు స్తంభించిపోయింది. విపరీతంగా ఈ సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఖర్చులు తగ్గించుకోవడం, విమానాలు విక్రయించడం, ఉద్యోగాల కోత ఇలాంటి ఎన్నో చర్యలకు గురైన విమానయాన సంస్థలు తిరిగి లాభాల బాటలోకి రానున్నాయి.
ప్రయాణికుల జోష్..
అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు దేశీయ సర్వీసుల సంఖ్య పెరగడంతో లాభాలు పెరగొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022-23లో మొత్తం విమాన ప్రయాణికుల సంఖ్య 68-70 శాతం పెరిగి 31.7- 32 కోట్లకు చేరొచ్చని, మన దేశ విమాన ప్రయాణికుల సంఖ్య 64-66 శాతం పెరిగి, కరోనా ముందు స్థాయికి చేరుతుందని ఇక్రా అంచనా వేస్తోంది.
పెట్టుబడులూ వస్తున్నాయి..
2022-23లో విమానశ్రయాల నిర్వహణ ఆదాయం 49-51 శాతం వృద్ధితో రూ.14,400- 14600 కోట్లుగా నమోదుకావచ్చని, సంస్థల నిర్వహణ మార్జిన్లు 29-30 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
రాబోయే ఐదేళ్ళలో రూ.90,000 కోట్ల వరకు పెట్టుబడులు విమానశ్రయ రంగంలోకి రావొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఇందులో ప్రధాన విమానశ్రయ పెట్టుబడులు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న విమానశ్రయాల్లో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, కొత్తగా నిర్మించే 21 విమానాశ్రయాల్లోకి చేరే రూ.30,000-34,000 కోట్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ 6 విమానాశ్రయాల్లో పెట్టనున్న రూ.17000 కోట్లు కలిసి ఉన్నాయి.
ఉద్యోగాలు ఊడాయ్..
విమానరంగంలో కరోనా కారణంగా 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 10 శాతం ఉద్యోగాలు తొలగింపుకు గురయ్యాయి. విమానయాన సంస్థలు, విమానశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ కార్గో విభాగంలో కలిపి మొత్తం 19,200 ఉద్యోగాలు పోయాయి. తక్కువ కాలంలో ఎయిర్ కార్గో కంపెనీల్లో మాత్రమే నియమకాలు జరిగాయి. విమానయాన సంస్థలో సిబ్బంది 74,800 నుంచి 65,700కు, విమానశ్రయాల్లో సిబ్బంది సంఖ్య 73,400 నుంచి 65,700 తగ్గిందని అధికారుల సమాచారం.