ఓటమికి విజయానికి ఉండే దూరం కేవలం ప్రయత్నమే. ఆ ప్రయత్నం కొనసాగితే తప్పకుండా వచ్చేదే విజయం. బంధాలు, బాధలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ మనల్ని విజయానికి చేరే దూరాన్ని పెంచగలవేమో కానీ విజయాన్ని ఎన్నటికీ దూరం చేయలేవు. ఎందరో విజేతల జీవితాల్లో మనం ఈ విషయాన్ని చూశాం. దానికి మరొక ప్రత్యక్ష సాక్ష్యం వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. రూ. లక్షా 83 వేల 482 కోట్ల విలువైన వేదాంత గ్రూప్ నకు చైర్మన్ అనిల్ అగర్వాల్. గ్లోబల్ డైవర్సఫైడ్ నేచురల్ రీసోర్స్ కంపెనీ ఇది. జింక్, కాపర్, ఐరన్ ఓర్,లెడ్ వంటి లోహలను ఉత్పత్తి చేసే పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. కంపెనీ ఈ స్థాయికి చేరుకునేందుకు అనిల్ అగర్వాల్ చేసిన కృషి ఎలాంటిదో మనం అర్థంచేసుకోవచ్చు. ఇంతటి విజయం అంత ఈజీగా సాధ్యకాలేదు.
వేదాంత గ్రూప్ చైర్మెన్ అనిల్ అగర్వాల్ గత కొద్ది రోజులుగా తన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటనలు, మలుపు తిప్పిన రోజులను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.కెరీర్ ఆరంభంలో తాను చేసిన రిస్క్ లు వాటి వల్ల ఎదురైన అనుభవాలు వివరించారు. బ్యాంకులు, బందువుల నుంచి రూ.16 లక్షలు అప్పు తెచ్చి 1971లో షంషేర్ కేబుల్ కంపెనీని అనిల్ అగర్వాల్ కొన్నారు. ఇప్పటి వరకు షంషేర్ కంపెనీకి స్క్రాప్ అమ్మే ఆయన ఒక్కసారిగా అదే కంపెనీకి యజమాని అయ్యారు. అయితే అక్కడి నుంచి వ్యాపార నిర్వహణ పూలబాట కాలేదు. ముళ్ళబాట అయ్యింది.
కష్టాలే కష్టాలు..
ఎక్కువ అప్పులు చేసి కొనుగోలు చేసినా షంషేర్ కంపెనీ ఆ సమయంలో మార్కెట్లలో కేబుళ్ళకు అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో నెల తిరిగేసరికి ముడిసరుకులు కొనేందుకు డబ్బులు లేకపోగా కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. వ్యాపారం లేకపోయినా ప్రతినెలా జీతాలు ఇవ్వాలంటే చాలాకష్టంగా ఉండేది అనిల్ అగర్వాల్ కి. తరచూ రుణాల కోసం బ్యాంకుల దగ్గరే ఉండాల్సి వచ్చేది. కేబుళ్ళ వ్యాపారంలో కేవలం ఉద్యోగులకు జీతాలు సర్థుబాటు చేయడం కోసం కొన్ని కొత్త పద్దతులు ప్రారంభించారు. మాగ్నెటిక్ కేబుల్స్, అల్యూమినియం రాడ్స్, వివిధ రకాలైన వైర్లు ఇలా తొమ్మిది రకాలైన బిజినెస్ లు చేశారు. ఏ వ్యాపారంలో లాభాలు రాకపోగా అప్పులు మరింత పెరిగాయి.
సినిమాలు చూసే వాడిని..
ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టాలు వదలకపోవడంతో ఒక్కోసారి భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయేది. ఆ సమయంలో ధైర్యం కోసం ముంబాదేవి ఆలయం నుంచి మొదలుపెట్టి ప్రతిచోటుకీ వెళ్ళి ప్రార్థనలు చేసేవాడినంటూ చెప్పారు అనిల్ అగర్వాల్. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, జిమ్ చేసేవాడినని చెప్పారు. ఒక్కోసారి ఈ ఒత్తిడి తట్టుకోలేక దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. కానీ బాధ్యతల పరంగా ఏం చేయలేకపోవాడిని. అలాంటి సందర్భాల్లో సినిమాలకు వెళ్ళేవాడినంటూ చెప్పుకొచ్చారు.
1971లో మొదలైన ప్రయాణం 1979లో వేదాంతగా మారింది.
1986లో ప్రభుత్వ నిర్ణయంతో లాభాలు..
టెలిఫోన్ రంగంలో ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన కేబుళ్ళను కూడా వినియోగించవచ్చంటూ 1986లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అంటే దాదాపు 10ఏళ్ళ పాటు కేవలం కష్టాల కడలినే ఓపికగా ఈదినట్టు తెలిపారు. 1986 తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటున్నారు. నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా చెప్పుకునే వేదాంత గ్రూపు స్థాపించడంలో షంషేర్ కేబుల్ నేర్పిన పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఖచ్చితంగా చెప్పగలను.