gold hall marking is very important
* మన బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తే హాల్ మార్కింగ్
* జూన్ నుంచి అమల్లోకి కొత్త విధానం
బంగారంపై మనకు ఉండే మోజు తెలియంది కాదు. భారతీయ మహిళలైతే భర్త కన్నా బంగారాన్నే ఎక్కువగా ప్రేమిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకుని బంగారాన్ని విక్రయించే వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. నాణ్యత లేని బంగారం, నకిలీ ఆభరణాలు, దొంగ బంగారం ఇలారకరకాలుగా వినియోగదారులను దోచుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు జాగ్రత్త పడుతుండగా తెలియని ప్రజలు మోసపోతున్నారు. ఎక్కువగా గ్రామాల్లో ఇలాంటి మోసాలకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న దుకాణదారులు బిల్లులు కూడా ఇవ్వకుండా ఎటువంటి ధ్రువీకరణ లేని బంగారాన్ని అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ఎన్నోచర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హాల్ మార్క్ పద్దతిని తప్పసరి చేస్తోంది.
దశల వారీగా అమల్లోకి..
బంగారు ఆభరణాల పై తప్పనిసరిగా హాల్ మార్కింగ్ వేసే నిబంధన రెండోదశ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దశల వారీగా క్రమ క్రమంగా ఈ పద్ధతిని అమలు చేసిన ప్రభుత్వం ఇకపై తప్పని సరి చేయనుంది. 2021 జూన్ 23 నుంచి 256 జిల్లాల్లో మొదటి విడత హాల్ మార్కింగ్ విధానం అమలవుతోంది.
ఇలా హాల్ మార్క్ పొందిన బంగారు ఆభరణాలు నాణ్యతతో కూడినవై ఉంటాయి. వీటిని విక్రయించడం కూడా సులువవుతుంది. పూర్తిగా పరీక్షించిన తర్వాతే హాల్ మార్క్ ఇవ్వడంతో ఇందులో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు.
* 14, 18, 22 క్యారెట్ల బంగారం ఆభరణాల స్వచ్ఛతకు ధ్రువీకరణ ఇస్తున్నారు. సగటున రోజుకి 3 లక్షల ఆభరణాలకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణ ( హాల్ మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్-హెచ్ యూఐడీ) ఇస్తున్నారు. జూన్ 1 నుంచి 20, 23, 24 క్యారెట్ల ఆభరణాల, రూపులకు రెండో విడత కింద హాల్ మార్కింగ్ ధ్రువీకరణ ప్రారంభమవుతుంది. ఇంకా 32 జిల్లాలకు ఈ ప్రక్రియ విస్తరిస్తుంది.
* ఎవరైనా తమ ఆభరణాలతో భారతీయ ప్రమాణాల మండలి ధ్రువీకరణ కలిగిన అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్ (ఏహెచ్ సీ)కి వెళ్ళి బంగారం స్వఛ్ఛతను పరీక్షించి ధ్రువీకరణ పొందవచ్చు. మనం తెచ్చిన ఆభరణాలను ఈ కేంద్రాలు పరీక్షించి నివేదిక ఇస్తాయి. ఆభరణం నాణ్యతపై భరోసా ఉండడంతో పాటు మనకి అవసరమైనపుడు ఆ ఆభరణాలను అమ్ముకోడానికి కూడా ఈ ధ్రువీకరణ చూపొచ్చు. దీనికోసం 4 వస్తువులకైతే రూ.200 ఛార్జి చేస్తారు. అంతకిమించి ఎక్కువ వస్తువులకైతే ఆభరణానికి రూ.45 చొప్పున వసూలు చేస్తారు.